Monday 4 June 2012

ఆరోగ్యం-1

ఆరోగ్యం: ఈ విభాగం లో మేము పెట్టుకున్న లక్ష్యం.
 ప్రొద్దున లేవగానే పరగడుపున రాగి చెంబులో నీళ్ళు త్రాగటం 
చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం. కానీ తర్వాత ఎందుకో ఆ అలవాటు తప్పి పోయింది.ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ అలవాటు చేసుకున్నాను. దీని గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు అర్ధం అయిన విషయాలు ముందు చెప్తాను.
మా చిన్నప్పుడు ఒక ప్రక్క అమ్మ,మేము స్కూల్ కి వెళ్ళే హడావిడి,.ఆ టైం లోనే మా తాతగారు రాగి చెంబు, గ్లాసు, ఉద్ధరిణి తోమే కార్యక్రమం మొదలు పెట్టేవారు.చక్కగా చింతపండు , లేదా వాడేసిన నిమ్మ తొక్కులు, కొంచం ఉప్పు వేసి ఎంతో శ్రద్ధగా తళతళ మెరిసేలా తోమేసేవారు. ఆ పని మేము చేస్తామని చెప్పినా వినేవారు కాదు. తర్వాత మా ఇళ్ళల్లో నేను గమనించింది ఏంటంటే ఈ రాగి చెంబులు మాత్రం మగవాళ్ళే తోముకుని సంధ్యావందనం కోసం సిద్ధం చేసుకునేవారు.
దీనివెనుక చాలా ఆరోగ్య రహస్యం ఉంది అని నాకు అర్ధం అయ్యాక మన పెద్దవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో కదా అని అనిపించింది.
ఏమిటి దీని వెనక ఉన్న ఆరోగ్య రహస్యం అంటే...మా తాతగారు దాదాపు 80 ఏళ్ళు జీవించారు. అది కూడా పూర్తి ఆరోగ్యంతో. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయన చేతుల్లో పట్టు పోలేదు. ఆ వయసులో కూడా అయన రాసుకుంటూ ఉండేవారు.చెయ్యి వణకడం కాని , తడబాటు కాని మేము చూడలేదు.
ఈ విషయం గురించి నాకు అర్ధం అయ్యాక...నేను మరి కొంచం గమనించడం మొదలు పెట్టాను. కొన్నాళ్ళ క్రితం వరకు నా స్నేహితురాళ్ళు అంట్లు తోమేందుకు పని అమ్మాయిని పెట్టుకున్నారు.ఆ సమయంలో వాళ్ళు చిన్న పని చేసినా చేతులు నొప్పులు అని, చేతుల్లో పట్టు ఉండటం లేదు అని  బాధపడేవారు. అప్పుడు నేను ఒక సలహా ఇచ్చాను.కొన్ని రోజులు పని అమ్మాయిని మాన్పించి అంట్లు తోముకోవడం, ఇల్లు తుడుచుకోవడం లాంటి పనులు మీరే చేసుకుని చూడండి అని.ఈ సలహా పని చేసింది. నా స్నేహితురాలు వందన వాళ్ల అమ్మగారు అయితే ఈ సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు కూడా వాడారు.కాని ఏమి ప్రయోజనం కనిపించలేదు. ఎప్పుడయితే ఇంటిపని చేసుకోవడం ఆరంభించారో నొప్పులు ఎటు పోయాయో కూడా తెలీదు.
ఆడవా ళ్ళు  అంటే ఈ పనులు చేసుకుంటారు కాబట్టి వాళ్ల చేతులకి వ్యాయామం ఉంటుంది.మరి మగవాళ్ళు ?? అందుకే ఈ రాగి చెంబు మాత్రం వాళ్లు తోముకునేవారేమో ?? అని నాకు అనిపించింది.
నాకు తెలిసి మనలో చాలామంది పెన్ను పట్టుకుని రాయడం మానేశారు.అంతా కంప్యూటర్ మీదనే...కావాలంటే చూడండి నాలుగు వాక్యాలు రాసేసరికి మీ చేతి వేళ్ళు నొప్పులు పుడతాయి. కాబట్టి మిగత పని మొత్తం చేసుకోలేకపోయినా కనీసం రాగి చెంబులు అయిన మీరే తోముకోవడం మొదలు పెట్టండి.

ఇక ఇప్పుడు రాగి పాత్రలో నీళ్ళు ఉంచి తాగడం వలన ఏమిటి ప్రయోజనం అనేది చెప్పుకుందాం.
ఈ విధానం మీద పరిశోధన జరిపిన బ్రిటిష్ పరిశోధకులు ఇది ఒక అద్భుతం అని వారి పరిశోధనలో కనుక్కున్నట్టు వెల్లడి చేసారు.

వివిధ తరహా పాత్రలలో నిల్వ చేసిన మంచి నీటి మీద బ్రిటిష్ మైక్రో బయాలజిస్ట్ లు పరిశోధన జరిపారు.ఈ ప్రయోగంలో భాగంగా స్టీలు, ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉంచిన నీటిలో సూక్ష్మ జీవుల సంఖ్య  గణనీయంగా పెరగానారంభించాయి.అంతేకాదు రెండు రోజులు ఇలా నిల్వ ఉంచి తర్వాత ఆ నీటిని తాగితే విరోచనాలతో పాటు ఇతర జీర్ణనాళపు అనారోగ్యాలకి కూడా గురి కావాల్సి వతుందని కూడా వారు గమనించారు.

ఇక రాగి పాత్ర విషయానికి వస్తే రాగి పాత్రలో నిలవ ఉంచిన నీటిలో 48 గంటల తర్వాత  పరిశీలిస్తే అందులోని సూక్ష్మ జీవులు దాదాపుగా కనిపించకుండాపోయాయట . రాగి పాత్రలు తయారీలో వాడే రాగి నీటిలో ఉన్న బాక్టీరియాల కణ కవచాలను బద్దలు కొడుతుంది అని ఫలితంగా వాటి  సంఖ్య తగ్గిపోతుంది అని పరిశోధకులు వివరించారు.  అభివృద్ధి చెందుతున్న దేశాలలో లక్షలాది శిశు మరణాలకి కారణం నీటి ద్వారా వ్యాప్తి చెందుతున్న బాక్టీరియానే. కాబట్టి ఇకనయినా  ఇళ్ళల్లో అటకల మీద ఉన్న రాగి చెంబులు, బిందెలు క్రిందకి దించి వాడటం మొదలు పెట్టండి.

ఆయుర్వేదం ...పొద్దున్నే నిద్ర లేవగానే రాగి చెంబులో నీళ్ళు తాగమని చెప్తోంది.
ఇది మేము గత కొన్ని రోజులుగా చేస్తున్నాము.నిజ్జంగానే ఎంతో ప్రయోజనం ఉంది.ఆయుర్వేదం ఈ జలాన్ని తామ్ర జలం గా పేర్కొంటుంది.

ఈ నీటిని తాగడం వలన మన శరీరంలో ఉన్న త్రి దోషాలు ( వాత, పిత్త, కఫ దోషాలు ) బాలన్సు చేయబడతాయి. ఫలితంగా మన ఆరోగ్యంలో ఎంతో మార్పు వస్తుంది.చర్మ సంబంధిత సమస్యల దగ్గరినుంచి , అధిక బరువు వరకు అందరికి ఈ తామ్ర జలం ఎంతో మేలు చేస్తుంది.
చివరగా ఒక మాట చెప్పి ఈ పోస్ట్ ముగిస్తాను.
మన పెద్దవాళ్ళకి ఇవి అన్నీ ఎలా తెలుసో?? ఎలాంటి పరిశోధనలు చేయకుండానే వాళ్ళు ఇలాంటి అద్భుతమయిన విషయాలు ఎలా చెప్పగలిగారో  నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వీరంతా మనకి పూజనీయులు...
ఇదే మన దేశ సంస్కృతి...
ఇదే మన దేశ గొప్పతనం.

No comments:

Post a Comment