Monday 4 June 2012

ఆరోగ్యం-1

ఆరోగ్యం: ఈ విభాగం లో మేము పెట్టుకున్న లక్ష్యం.
 ప్రొద్దున లేవగానే పరగడుపున రాగి చెంబులో నీళ్ళు త్రాగటం 
చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళం. కానీ తర్వాత ఎందుకో ఆ అలవాటు తప్పి పోయింది.ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ అలవాటు చేసుకున్నాను. దీని గురించి తెలుసుకుంటున్నప్పుడు నాకు అర్ధం అయిన విషయాలు ముందు చెప్తాను.
మా చిన్నప్పుడు ఒక ప్రక్క అమ్మ,మేము స్కూల్ కి వెళ్ళే హడావిడి,.ఆ టైం లోనే మా తాతగారు రాగి చెంబు, గ్లాసు, ఉద్ధరిణి తోమే కార్యక్రమం మొదలు పెట్టేవారు.చక్కగా చింతపండు , లేదా వాడేసిన నిమ్మ తొక్కులు, కొంచం ఉప్పు వేసి ఎంతో శ్రద్ధగా తళతళ మెరిసేలా తోమేసేవారు. ఆ పని మేము చేస్తామని చెప్పినా వినేవారు కాదు. తర్వాత మా ఇళ్ళల్లో నేను గమనించింది ఏంటంటే ఈ రాగి చెంబులు మాత్రం మగవాళ్ళే తోముకుని సంధ్యావందనం కోసం సిద్ధం చేసుకునేవారు.
దీనివెనుక చాలా ఆరోగ్య రహస్యం ఉంది అని నాకు అర్ధం అయ్యాక మన పెద్దవాళ్ళు ఎంత గొప్ప వాళ్ళో కదా అని అనిపించింది.
ఏమిటి దీని వెనక ఉన్న ఆరోగ్య రహస్యం అంటే...మా తాతగారు దాదాపు 80 ఏళ్ళు జీవించారు. అది కూడా పూర్తి ఆరోగ్యంతో. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది అయన చేతుల్లో పట్టు పోలేదు. ఆ వయసులో కూడా అయన రాసుకుంటూ ఉండేవారు.చెయ్యి వణకడం కాని , తడబాటు కాని మేము చూడలేదు.
ఈ విషయం గురించి నాకు అర్ధం అయ్యాక...నేను మరి కొంచం గమనించడం మొదలు పెట్టాను. కొన్నాళ్ళ క్రితం వరకు నా స్నేహితురాళ్ళు అంట్లు తోమేందుకు పని అమ్మాయిని పెట్టుకున్నారు.ఆ సమయంలో వాళ్ళు చిన్న పని చేసినా చేతులు నొప్పులు అని, చేతుల్లో పట్టు ఉండటం లేదు అని  బాధపడేవారు. అప్పుడు నేను ఒక సలహా ఇచ్చాను.కొన్ని రోజులు పని అమ్మాయిని మాన్పించి అంట్లు తోముకోవడం, ఇల్లు తుడుచుకోవడం లాంటి పనులు మీరే చేసుకుని చూడండి అని.ఈ సలహా పని చేసింది. నా స్నేహితురాలు వందన వాళ్ల అమ్మగారు అయితే ఈ సమస్యతో డాక్టర్ దగ్గరికి వెళ్లి మందులు కూడా వాడారు.కాని ఏమి ప్రయోజనం కనిపించలేదు. ఎప్పుడయితే ఇంటిపని చేసుకోవడం ఆరంభించారో నొప్పులు ఎటు పోయాయో కూడా తెలీదు.
ఆడవా ళ్ళు  అంటే ఈ పనులు చేసుకుంటారు కాబట్టి వాళ్ల చేతులకి వ్యాయామం ఉంటుంది.మరి మగవాళ్ళు ?? అందుకే ఈ రాగి చెంబు మాత్రం వాళ్లు తోముకునేవారేమో ?? అని నాకు అనిపించింది.
నాకు తెలిసి మనలో చాలామంది పెన్ను పట్టుకుని రాయడం మానేశారు.అంతా కంప్యూటర్ మీదనే...కావాలంటే చూడండి నాలుగు వాక్యాలు రాసేసరికి మీ చేతి వేళ్ళు నొప్పులు పుడతాయి. కాబట్టి మిగత పని మొత్తం చేసుకోలేకపోయినా కనీసం రాగి చెంబులు అయిన మీరే తోముకోవడం మొదలు పెట్టండి.

ఇక ఇప్పుడు రాగి పాత్రలో నీళ్ళు ఉంచి తాగడం వలన ఏమిటి ప్రయోజనం అనేది చెప్పుకుందాం.
ఈ విధానం మీద పరిశోధన జరిపిన బ్రిటిష్ పరిశోధకులు ఇది ఒక అద్భుతం అని వారి పరిశోధనలో కనుక్కున్నట్టు వెల్లడి చేసారు.

వివిధ తరహా పాత్రలలో నిల్వ చేసిన మంచి నీటి మీద బ్రిటిష్ మైక్రో బయాలజిస్ట్ లు పరిశోధన జరిపారు.ఈ ప్రయోగంలో భాగంగా స్టీలు, ప్లాస్టిక్ బాటిల్స్ లో ఉంచిన నీటిలో సూక్ష్మ జీవుల సంఖ్య  గణనీయంగా పెరగానారంభించాయి.అంతేకాదు రెండు రోజులు ఇలా నిల్వ ఉంచి తర్వాత ఆ నీటిని తాగితే విరోచనాలతో పాటు ఇతర జీర్ణనాళపు అనారోగ్యాలకి కూడా గురి కావాల్సి వతుందని కూడా వారు గమనించారు.

ఇక రాగి పాత్ర విషయానికి వస్తే రాగి పాత్రలో నిలవ ఉంచిన నీటిలో 48 గంటల తర్వాత  పరిశీలిస్తే అందులోని సూక్ష్మ జీవులు దాదాపుగా కనిపించకుండాపోయాయట . రాగి పాత్రలు తయారీలో వాడే రాగి నీటిలో ఉన్న బాక్టీరియాల కణ కవచాలను బద్దలు కొడుతుంది అని ఫలితంగా వాటి  సంఖ్య తగ్గిపోతుంది అని పరిశోధకులు వివరించారు.  అభివృద్ధి చెందుతున్న దేశాలలో లక్షలాది శిశు మరణాలకి కారణం నీటి ద్వారా వ్యాప్తి చెందుతున్న బాక్టీరియానే. కాబట్టి ఇకనయినా  ఇళ్ళల్లో అటకల మీద ఉన్న రాగి చెంబులు, బిందెలు క్రిందకి దించి వాడటం మొదలు పెట్టండి.

ఆయుర్వేదం ...పొద్దున్నే నిద్ర లేవగానే రాగి చెంబులో నీళ్ళు తాగమని చెప్తోంది.
ఇది మేము గత కొన్ని రోజులుగా చేస్తున్నాము.నిజ్జంగానే ఎంతో ప్రయోజనం ఉంది.ఆయుర్వేదం ఈ జలాన్ని తామ్ర జలం గా పేర్కొంటుంది.

ఈ నీటిని తాగడం వలన మన శరీరంలో ఉన్న త్రి దోషాలు ( వాత, పిత్త, కఫ దోషాలు ) బాలన్సు చేయబడతాయి. ఫలితంగా మన ఆరోగ్యంలో ఎంతో మార్పు వస్తుంది.చర్మ సంబంధిత సమస్యల దగ్గరినుంచి , అధిక బరువు వరకు అందరికి ఈ తామ్ర జలం ఎంతో మేలు చేస్తుంది.
చివరగా ఒక మాట చెప్పి ఈ పోస్ట్ ముగిస్తాను.
మన పెద్దవాళ్ళకి ఇవి అన్నీ ఎలా తెలుసో?? ఎలాంటి పరిశోధనలు చేయకుండానే వాళ్ళు ఇలాంటి అద్భుతమయిన విషయాలు ఎలా చెప్పగలిగారో  నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. వీరంతా మనకి పూజనీయులు...
ఇదే మన దేశ సంస్కృతి...
ఇదే మన దేశ గొప్పతనం.

అలవాట్లు/ఆచారాలు-1

మన పెద్దవాళ్ళ జీవిత విధానం నేటి మన ఆధునిక జీవిత విధానాన్ని కలిపి మనం  అనుసరించాల్సినవి చర్చించుకుంటూ వీలున్నంతవరకు పాటించే ప్రతిదాని వెనక శాస్త్రీయమయిన కోణం ఏదయినా ఉందేమో తెలుసుకోవడం ...ఆ తర్వాత నిజాయితీగా అనుసరించడం.

1. అలవాట్లు/ఆచారాలు: ఈ విభాగం లో మొట్టమొదటిది...

ప్రతి పూటా కృతఙతా భావంతో ఉండటం...అలాగే దేవుని ప్రార్ధనతో రోజు ఆరంభించడం.

ఉదయం నిద్ర లేవగానే అరచేతిని చూసుకుంటూ  ఈ శ్లోకం చదువుకోవాలి

కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి
కరమూలేతు గోవిందః ప్రభాతే కర దర్శనం


ఇలా చదవటం వలన ఏమిటి ప్రయోజనం?

ఉదయం నిద్ర లేవగానే ఆలాగే రాత్రి నిద్ర పోయేముందు మనం ఏ మాటలు అయితే వింటామో, ఏ దృశ్యాన్ని చూస్తామో వాటి ప్రభావం మన మీద ఉంటుంది. అంటే ఉదయం నిద్ర లేవగానే అలాగే రాత్రి నిద్రపోయే ముందు మంచి మాటలు వినాలి  మంచి దృశ్యాలు చూడాలి. అందువల్లనే ఉదయం నిద్ర లేవగానే, రాత్రి నిద్రపోయేముందు
దైవ ప్రార్ధన చేసుకోవాలని పెద్దవాళ్ళు చెప్పారు.

అయితే ఏదో ఒక దైవ ప్రార్ధన చేసుకోవచ్చు కదా ఈ శ్లోకమే ఎందుకు చదవాలి?
ఉదయం నిద్ర లేవగానే చదివే శ్లోకం, స్నానం చేసేటప్పుడు, భోజనం చేసేటప్పుడు , రాత్రి నిద్రించేటప్పుడు వేరు వేరు శ్లోకాలు చదువుకోగలిగితే మంచిదే లేదా కనీసం ఉదయం నిద్ర లేవగానే, అలాగే రాత్రి నిద్రించేటప్పుడు ఈ శ్లోకాన్ని చదువుకోవడం అలవాటు చేసుకోండి.

కరాగ్రే వసతే లక్ష్మి కర మధ్యే సరస్వతి
కరమూలేతు గోవిందః ప్రభాతే కర దర్శనం


నేను ఏ అరచేతిని చూసుకుంటున్నానో ఆ అరచేతికి ఉన్న వేళ్ళ చివరి భాగం లోనాకు లక్ష్మి దేవి కనిపిస్తోంది.
అరచేతి మధ్యలో నాకు సరస్వతి దేవి దర్శనం ఇస్తోంది.
కరమూలేతు గోవిందః ఆంటే నా అరచేయి ప్రారంభం అయిన మణికట్టు దగ్గర గోవిందుడు అనగా సాక్షాత్తు
శ్రీనారాయణుడిని దర్సిస్తున్నాను.కాబట్టి ఈ అరచేయి కేవలం అరచేయి కాదు. ఈ అరచేయి ముగ్గురు దేవతలకు ఏర్పాటు చేసిన సింహాసనం అని అర్ధం.

ఇంత అర్ధం ఉన్నందువల్లనే ఉదయం నిద్ర లేవగానే అరచేతిని దర్శించుకుంటూ ఈ శ్లోకం చదువుకోవాలని పెద్దవాళ్ళు చెప్పారు. 

చేతి అయిదు వేళ్ళు పంచభూతాలకి సంకేతం. ఈ పంచభూతాలను నా అరచేతిలో కనిపిస్తున్న దేవతలు అదుపు చేస్తుంటే ఆ పంచభూతాల అదుపులో ఉన్న నాకు ఈ కష్టము కలగకుండా ఉండాలని దేవతలను ప్రార్ధిస్తున్నాను..

ఇలా చేయడం ఆరంభించిన కొద్ది రోజుల తర్వాత నేను మంత్ర శక్తి గురించి చదవడం జరిగింది. కొన్ని శ్లోకాలు నేర్చుకోవడం, కొన్ని పద్యాలు కంటస్తం చేయడం మొదలు పెట్టాను. మదురై లో ఉండే మా గురువుగారు నాకు ఒక మంత్రం ఉపదేశించారు. ఆ మంత్రం కూడా రోజూ జపించడం మొదలుపెట్టాను.

సైనస్ తో బాధపడే నేను ఎటువంటి మందులు వాడకుండా యోగ, ప్రాణాయామంతో పాటు ఈ శ్లోకాలు , మంత్రం జపించడం మొదలు పెట్టిన నాటినుంచి  సైనస్ కంట్రోల్ అయ్యింది. అలాగే ఆందోళన, వ్యాకులత కూడా బాగా తగ్గింది.
ఏ విషయం గురించి అయినా ఆలోచించేటప్పుడు నా ఆలోచనల్లో చాల స్పష్టత ఉంటోంది. 
మాకాలనీలో కొంతమంది చిన్న పిల్లలికి హనుమాన్ చాలీసా నేర్పించి రోజూ పొద్దున్న లేచి స్నానం చేసి చాలీసా చదివాకే ఏ పని అయినా చేయాలని చెప్పాము.వాళ్ళు కూడా వాళ్ళ పెద్దవాళ్ళ సహకారంతో చక్కగా చాలీసా నేర్చుకున్నారు. రోజూ చదవడం మొదలుపెట్టారు.ఇలా మొదలు పెట్టిన కొద్ది రోజుల్లోనే ఫలితం కనిపించింది.ఆ పిల్లల తల్లి తండ్రులు ఇదివరకు కన్నా ఆ పిల్లల్లో ఏకాగ్రత పెరిగింది అని , అల్లరి తగ్గింది అని  , పెద్దవాళ్ళ మాట చక్కగా ఆలకిస్తున్నారు అని చెప్పారు. ఈ మాట విన్నప్పుడు చాల సంతోషంగా అనిపించింది.

తర్వాత నా స్నేహితురాలు ఒకరికి అస్తమా ఉంది. పిల్లి కూతలు అవి చాలా అవస్థ పడుతూ ఉంటుంది. తన మీద నేను ఈ ప్రయోగం ఇప్పుడు చేస్తున్నాను .రోజూ ఇంట్లో గట్టిగా  విష్ణు సహస్ర నామం చదవమని చెప్పాను. తను కూడా వెంటనే ఆరంభించింది. ప్రస్తుతం తన పరిస్థితి కొంత మెరుగుగా ఉన్నది. శ్లోకాలు, పద్యాలు, మంత్రం జపించడం, దైవ ప్రార్ధన ఇవి అన్ని మన పెద్దవాళ్ళు చెప్పినట్టు జీవితం మీద , ఆరోగ్యం మీద , మనవ సంబంధాల మీద ఎంతో ప్రభావం చూపిస్తాయి అని నాకు అర్ధం అవుతోంది. వాళ్ళందరికీ శతకోటి నమస్కారాలు.

అలాగే రోజూ ప్రొద్దున స్నానం చేశాక తప్పని సరిగా పెద్దలకి, ఇష్ట దైవానికి నమస్కరించటం. కోరికల చిట్టా చెప్పుకోవటానికి కాదు! జన్మనిచ్చినందుకు ధన్యవాదాలు చెప్తూ, సన్మార్గంలో నడుస్తానని చెప్పుకోవటానికి

చందమామ

మన పెద్దవాళ్ళ జీవిత విధానం నేటి మన ఆధునిక జీవిత విధానాన్ని కలిపి మనం  అనుసరించాల్సినవి చర్చించుకుంటూ ...వీలున్నంతవరకు పాటించే ప్రతిదాని వెనక శాస్త్రీయమయిన కోణం ఏదయినా ఉందేమో తెలుసుకోవడం ...ఆ తర్వాత నిజాయితీగా అనుసరించడం.
 
మా లక్ష్యాలు ఇవి..
లక్ష్యాలు: 
 
1. అలవాట్లు, ఆచారాలు
 
2. ఆరోగ్యం
 
3. బంధాలు
 
4. ప్రకృతి, వ్యవసాయం
 
5. కళలు
 
6. బాధ్యతలు 

మాటలు, ఆలోచనల కంటే ఆచరణే ముఖ్యం. ప్రతి నెలా మాకంటూ కొన్ని చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాటి గురించి చర్చించి, ఆచరిస్తాం. నెల చివరలో తప్పనిసరిగా ఒక్కొక్కరూ ఎంతవరకు ఆచరించగలిగామో నిజాయితీగా అందరితో పంచుకుంటాం . మన అలవాట్లు మార్చుకుంటున్నప్పుడు కొత్తలో కొంచం కంగారుగా, కష్టంగా ఉంటుంది. కాకపోతే ఇక్కడ చెప్పే ప్రతిది ఎందుకు చేయాలో చెప్పే చేస్తాము కాబట్టి ఎందుకు మారాలో తెలుస్తుంది.ఎందుకు అన్నదానికి సమాధానం తెలిస్తే మనసు మనకి తెలీకుండానే మార్పు దిశగా అడుగులు వేస్తుంది.దీనికి సంబంధించి  ఏవయినా సూచనలు , సలహాలు ఉంటే తప్పకుండా తెలియచేయండి.